19 September, 2019 | Category : NEWS

51 సంవత్సరాల క్రితం 1968 సెప్టెంబరు 19 న కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఒక రోజు నిరసన

51 సంవత్సరాల క్రితం 1968 సెప్టెంబరు 19 న కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఒక రోజు నిరసన సమ్మె జరిగింది. అవసరాల ప్రాతిపదికన కనీస వేతనం చెల్లింపు, ధరల పెరుగుదలకు పూరి పరిహారము లభించే విధముగా డిఏ చెల్లింపు తదితర డిమాండ్ల కోసం ఈ సమ్మె జరిగింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమ్మెని పాశవికంగా అణచి వేసింది. ఈ సమ్మెని తిరుగుబాటుగా ప్రకటించింది. అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టాన్ని ప్రకటించింది. దేశమంతట 12000 మంది ఉద్యోగులను అరెస్ట్ చేసి జైళ్ళ లో పెట్టింది. రైల్వే ఉద్యోగులు ముగ్గురు పోలీసు కాల్పులలో చని పోయారు. పికెటింగ్ చేస్తున్న సందర్భముగ ట్రయిన్ వారి పై వెళ్ళినందున 5 గురు చనిపోయారు. ఇంకొకరిని ఢిల్లీ లో ఇంద్ర ప్రస్థ భవనం పై అంతస్థు నుండి పోలీసులు తోసి వేలమందిన చనిపోయారు. టెర్మినేషన్లు, సస్పెషన్లు, తొలగింపులు తదితర అణచివేత చర్యలను అమలు చేసింది. 6.5.1969 న పార్లమెంట్లో ఇచ్చిన జవాబు ప్రకారం 24848 మందికి టెర్మినేషన్ నోటీసులిచ్చారు. అత్యవసర సర్వీసుల నిర్వహణ ఆర్డినెన్స్ పేరుతో 1073 మందిని అరెస్ట్ చేసి విచారణలు జరిపారు. 2988 మందిని సస్పెండ్ చేశారు. సిసిఎస్ రూల్సు పేరుతో మరో 1189 మందిని సస్పెండ్ చేశారు. ఆ తరువాత చాలా కాలానికి గాని ఈ కేసులను ఎత్తివేసి ఉద్యోగం లోకి తీసుకున్నారు. ఎస్మా పేరుతో తమ రాష్ట్రం లో వున్న కేంద్ర ప్రభుత్వోగ్యుల పై చర్య తీసుకోము అని ఆ నాడు కేరళ ముఖ్యమంత్రిగా వున్న కా.ఇఎంఎస్ నంబూదిరిపాద్ ( సిపిఎం పార్టీ) ప్రకటించి సమ్మెని బలపరచారు. ఇటువంటి అసమాన త్యాగాల తో గతం లో చేసిన పోరాటాల వలననే నేడు మనం అనేక హక్కులను సాకర్యాలను పొందుతున్నాము. ధరల పెరుగుదలకు అనుగుణముగా ఆటోమేటిక్ గా డిఎ చెల్లింపు విధానానికి దారి తీసిన పోరాటాలలో ఇదొకటి. ఇదే విధముగా కేంద్ర ప్రభుత్వోద్యోగుల కు అవసరాల ప్రాతిపదికగా రు.18000 కనీస వేతనం అమలు లోకి రావటానికి కారణమైన పోరాటాలలో ఇదొకటి. ఈ వీరోచిత పోరాటం సందర్భముగ అమరులైన వారికి బిఎస్ఎన్ఎల్ ఇయు ఆంద్ర ప్రదేశ్ తరఫున శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాము. కానీ ఈ పోరాట ఫలాలు అయాచితముగా వచ్చాయని అనుకుంటూ సమ్మె చేస్తే జీతాలు కోతపడ్డాయి కాబట్టి ఎందుకు చేయాలి అనే స్వార్థ చింతన పెరుగుతున్నది. ప్రభుత్వానికి, మేనేజి మెంటుకి భజన చేస్తే వాళ్ళే మన డిమాండ్లను పరిష్కరిస్తారనే తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసే సంఘాలు చెప్పే మాయమాటలు నమ్ముతున్నారు. యూనియన్ల వలననే జీతాలు చెల్లింపు జరగటం లేదని కొందరు పనికి మాలిన వాళ్ళు అంటే నిజమే కదా అని అనుకునే వాళ్ళు వున్నారు. ఏ యూనియన్ లో లేకుండా వుండటమే గొప్ప అనే అతితెలివి గల వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో కొందరున్నారు. అన్నీ వడ్డించిన విస్తరలాగా అయాచితముగా నేడు రావటానికి గతంలో జరిగిన ఇటువంటి ఉద్యమాలే కారణమనే స్పృహ లేకుండా ఉద్యమాలకు దూరముగ వుంటూ , ఎక్కువ వయసు వున్న వారు విఆర్ఎస్ లో వెళ్ళితే తమకి మేలు జరుగుతుందనే భ్రమలో కొందరున్నారు. ఐక్య పోరాటాలు బలపడకుండా వుండేందుకు కొందరు కుల రాజకీయాలను నడుపుతుంటే వారి వలలో పడే పరిస్థితిలో మరి కొందరున్నారు. ఇటువంటి తప్పుడు ధోరణుల ప్రభావంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులలో కొందరయినా వున్నారనేది వాస్తవం. ఆ నాటి వీరోచిత పోరాటాలను, ఆ పోరాటాలలో అమరులైన వారిని స్మరించుకుని ఈ తప్పుడు ధోరణులను వదిలించుకుని స్వార్థ చింతనను విడనాడి ఐక్యముగా ఉద్యమిస్తేనే, త్యాగాలకు సిద్ధమైతేనే బిఎస్ఎన్ఎల్ ను మన భవిష్యత్తును, వేతన సవరణను, వేతనాల సక్రమ చెల్లింపును సాధించుకోగలం. 1968 సెప్టెంబరు సమ్మె లో అమరులైన వారికి, అనేక త్యాగాలు చేసిన వారికి మనము సమర్పించ గలిగే నివాళి మన బలహీన ఆలోచనలను వదిలించుకుని ఐక్య పోరాట బాటన దృఢ సంకల్పంతో పయనించటమే.

RELATED POSTS :